కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాహాబాహీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాహాబాహీ

Feb 8 2026 7:56 AM | Updated on Feb 8 2026 7:56 AM

కాంగ్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాహాబాహీ

గజ్వేల్‌: గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో శనివారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తంగా మారింది. ఈ సభకు మాజీ మంత్రి హరీశ్‌రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఘర్షణ నెలకొంది. అనంతరం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాలు ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గజ్వేల్‌కు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు ముందుగా పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా, ఢిల్లీవాలా హోటల్‌ వద్ద సభల్లో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రచారం పూర్తయ్యాక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్‌ వద్ద ప్రచార సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సదరు కాలనీకి చెందిన కాంగ్రెస్‌ శ్రేణులు హరీశ్‌రావును అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రచార సభ ప్రదేశానికి వచ్చారు. పెద్ద మొత్తంలో నాయకులు ర్యాలీగా అక్కడికి చేరుకొని హరీశ్‌రావు డౌన్‌ డౌన్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అప్పటికే హరీశ్‌రావు ఇక్కడికి రాకుండా తూప్రాన్‌ వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు మాత్రం ఇక్కడికి చేరుకొని ప్రచార సభను కొనసాగించారు. అయితే సమీపంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోటీగా కాంగ్రెస్‌కు వ్యతిరేక నినాదాలు చేయడంతో ఇరువర్గాలు ఒకరినొకరు దూర్భాషలాడుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. అనంతరం ఒకరిపై మరొకరు చెప్పులు విసురుకోవడంతోపాటు ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాసేపు గందరగోళం నెలకొనడంతో పోలీసులు సముదాయించడానికి ప్రయత్నించగా ఎవరూ వినలేదు. దీంతో ఏసీపీ నర్సింలు, గజ్వేల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో లాఠీఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా రోప్‌ వేశారు. సభ జరుగుతున్నంత సేపు ఆందోళనకారులను అటువైపు వెళ్లనివ్వకుండా కట్టడి చేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులు, ఆయా పార్టీల కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.

ఎగిరిన చెప్పులు.. హోరెత్తిన నినాదాలు

హరీశ్‌రావు వస్తున్నారని

అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ యత్నం

ఎన్నికల ప్రచార సభ ఉద్రిక్తం

ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాహాబాహీ1
1/1

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాహాబాహీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement