నేడు మల్లన్న నాల్గొవ వారం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గొవ ఆదివారం భక్తులు భారీగా తరలిరానున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాల్లో నాల్గవ ఆదివారం కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్‌కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఓడి బియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
బహిరంగ ప్రదేశంలో
మద్యం తాగితే చర్యలు
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: బహిరంగ ప్రదేశంలో మద్యం తాగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే ఇప్పటివరకు జరిమానాలు విధించేవారని, కానీ ఇకపై ఈ పెట్టి కేసుల్లో జైలు శిక్ష విధిస్తారన్నారు. మద్యం సేవించి గొడవలు చేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేసి తెలపాలని సీపీ పేర్కోన్నారు.
అంతర పంటతో
అధిక ఆదాయం
ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్‌బాషా
నంగునూరు(సిద్దిపేట): ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అంతర పంటలు సాగు చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ కమిషనర్ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. నర్మేటలో రైతు ఇర్ఫాన్ సాగు చేస్తున్న బ్లూబెర్రీ పంట, షేడ్‌నెట్ ద్వారా దేవులపల్లి వెంకటేశ్ సాగు చేస్తున్న యూరోపియన్ దోస పంటను పరిశీలించారు. పాలమాకులలో రైతు వీరారెడ్డి ఆయిల్‌పామ్ తోటలో సాగు చేస్తున్న శ్రీగంధం, అంజీర, అరటి, ఉల్లి సాగును పరిశీలించారు. అనంతరం యాస్మిన్‌మాట్లాడుతూ.. రైతులు అధిక ఆదాయం లభించే ఆయిల్‌పామ్ పంటను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సువర్ణ, డీడీఎస్ ఇంద్రసేనారెడ్డి, అధికారులు మౌనిక, బాలాజీ, రమేశ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుసాగుకు ప్రోత్సాహం
చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు పురుగుల పెంపకంలో రైతులు మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని పట్టు పరిశ్రమశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా అన్నారు. శనివారం మండల పరిధి చంద్లాపూర్‌లో రైతులు సాగు చేస్తున్న పట్టు సాగును పరిశీలించారు. అధికారులు పట్టుసాగు వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు.
విజ్ఞానాన్ని కళారూపంగా
చెప్పడమే ఒగ్గుకథ
ప్రొఫెసర్ కమలాకరశర్మ
గజ్వేల్‌రూరల్: విశిష్టమైన విజ్ఞానాన్ని కళారూపంగా మార్చి చెప్పడమే ఒగ్గుకథ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ అన్నారు. ఒగ్గుకథ–గతం–వర్తమానం–భవిష్యత్ అనే అంశంపై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖత్ అంజుమ్ మాట్లాడుతూ తెలంగాణకే ప్రత్యేకమైన ఒగ్గుకథ కళారూపాన్ని పరిరక్షించుకుందామన్నారు. ఒగ్గుకథ కళాకారులు రవికుమార్, మిద్దె వినిత్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ సిట్టింగ్ నిర్వహిస్తున్న
దాబా సీజ్
సిద్దిపేటకమాన్: అక్రమంగా సిట్టింగ్ నిర్వహిస్తున్న దాబాను సీజ్ చేసి, నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం ప్రకారం.. పట్టణంలో సీపీ రష్మి, సీఐ ఉపేందర్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వేములవాడ కమాన్ సమీపంలోని రాజరాజేశ్వరి దాబాలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు మద్యం సేవించడాన్ని సీపీ గుర్తించారు. దీంతో దాబా యజమాని పోదేన్ల దశరథంతోపాటు మద్యం తాగుతున్న ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.
నేడు మల్లన్న నాల్గొవ వారం


