కూరలేవీ?.. కొందరికేనా గుడ్డు?
ఇదేమి ‘మధ్యాహ్న భోజనం’
బడి వంటల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
వర్గల్ జెడ్పీ హైస్కూల్‌లో ఆకస్మిక తనిఖీ
చర్యలు తీసుకోవాలంటూ
డీఈఓకు ఆదేశం
వర్గల్(గజ్వేల్): ‘మెనూ ప్రకారం వంటలు లేవు.. ఇంకో కూర వండలేదు.. కొందరికే గుడ్డు.. ఇలాగేనా మధ్యాహ్న భోజనం.. బడి వంటల తీరు అంటూ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఫోన్‌ద్వారా డీఈఓను ఆదేశించారు. శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్‌లో మధ్యాహ్నభోజన వంటలను ఆకస్మిక తనిఖీ చేశారు. అన్నం, గుడ్డు, పప్పు చారులను పరిశీలించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం మరో కూర చెయ్యలేదని, 336 మంది విద్యార్థుల హాజరుకు బదులు 233 మంది విద్యార్థులకు మాత్రమే గుడ్లు పెట్టారని కలెక్టర్ మండిపడ్డారు. విద్యార్థుల హాజరు ప్రకారం కడుపునిండా భోజనం అందేలా చూడాలని, ఒకే కూరతో, కొంత మందికే భోజనం పెడితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. మెనూ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా ఫోన్ ద్వారా డీఈఓను ఆదేశించారు. చదువు, మధ్యాహ్న భోజనం విషయంలో లోటు లేకుండా జాగ్రత్త వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
వర్గల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కామన్ డైట్ మెనూ పాటిస్తూ విద్యార్థులకు రుచికర భోజనం పెట్టాలన్నారు. పిల్లలకు భోజనం, వసతి, చదువులో రాజీ పడొద్దని, క్రమశిక్షణాయుత విద్యాబుద్ధులు నేర్పించాలని ఎస్‌ఓ, ఉపాధ్యాయులను ఆదేశించారు.
జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు తరచూ పర్యవేక్షిస్తూ అవి పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శుక్రవారం వర్గల్ ఎంపీపీ కార్యాలయంలో ఇందిరమ్మ గృహాల పురోగతిని ఎంపీడీఓ దామోదర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటికి గ్రౌండింగ్ కావాలన్నారు. మంజూరైన వారు ఎందుకు కట్టుకోవడం లేదో కారణం తెలుసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాల దశల వారీగా వెంటవెంటనే హౌసింగ్ అధికారులు ఫోటో క్యాప్చర్ చేయాలన్నారు. పే మెంట్ విషయంలో లబ్ధిదారుల అపోహలను తొలగించాలని, వారి ఖాతాలోనే ప్రభుత్వం నిధులు జమ చేస్తుందన్నారు.
11న సెలవు
సిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 11న సెలవు ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలాగే ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న అన్ని భవనాలు/సంస్థలకు 10వ తేదీన నుంచే సెలవు ప్రకటించామన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, భవనాలకు 12న, 13న స్థానిక సెలవు వర్తించనున్నట్లు తెలిపారు.


