ఎవరి వ్యూహం.. వారిదే
గెలుపే లక్ష్యంగా ముందుకు
● ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి
● గజ్వేల్‌లో జోరందుకున్న ప్రచారం
● ప్రచార గడువు ముంచుకొస్తుండటంతో
ఆసక్తికరంగా రాజకీయాలు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ‘ఇలాకా’ కావడం వల్ల ప్రధానంగా బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీలు ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకుసాగుతున్నాయి. ఈ మున్సిపాలిటీపై పట్టు సాధించడానికి అవసరమైన అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార గడువు ఈనెల 9న ముగియనుండటంతో.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడిని పెంచాయి.
మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ఆదర్శంగా మారిందని బీఆర్‌ఎస్ వాదిస్తున్నది. వేలాది కోట్ల నిధులతో ఇక్కడ భారీ అభివృద్ధి పనులు జరిగాయని ప్రచారంలో చెబుతున్నారు. కేసీఆర్ వల్లే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కూడా చెబుతూ వస్తున్నారు. కాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్లే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్ నేతలు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తున్నారు. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసిత కాలనీ(ఆర్‌అండ్‌ఆర్ కాలనీ)లో బాధితులు ఎన్నో పెండింగ్ సమస్యలతో కొట్టామిట్టాడుతున్నారని ప్రచారంలో చెబుతున్నారు.
పార్టీల ప్రచారం తీరు ఎలా వున్నా.. ఓటర్లు మాత్రం అందరి మాటలను నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక పరిస్థితుల మేరకు తాము ఏ పార్టీ వైపు ఉండాలనే అంశంలో స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తున్నది. కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులకు పార్టీలకతీతంగా మద్దతు లభిస్తున్నది. ప్రధాన పార్టీల నాయకులు సైతం మరో పార్టీ అభ్యర్థికి బాహాటంగా మద్దతు పలుకుతూ.. ప్రచారం నిర్వహిస్తుండటం విశేషం. ఇకపోతే నిన్నటిమొన్నటి వరకు బీఫామ్‌ల విషయంలో పోటాపోటీ ప్రయత్నాలు చేసిన నాయకులు కొన్ని వార్డుల్లో కలిసిపోయి పనిచేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల మాత్రం బీఫామ్ దక్కని వారు మౌనంగా ఉండిపోతున్నారు. ఇంకొన్ని చోట్ల వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు.
ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు సానుభూతి అస్త్రం ప్రయోగిస్తున్నారు. గతంలో ఒకటిరెండుసార్లు ఓడిపోయిన అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో సానుభూతని వాడుకుంటున్నారు. ప్రచారం సందర్భంలో తాము గతంలో పలుసార్లు ఓడిపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయామని, ఈసారి గెలవకపోతే తమకు భవిష్యత్తు ఉండదని ఆందోళ వ్యక్తం చేస్తూ.. తమను ఎలాగైనా గట్టెక్కించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మొత్తానికి పార్టీల వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తిగా మారాయనడంలో సందేహం లేదు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. విమర్శలకు పదునుపెడుతూ.. వేడిని పెంచుతున్నాయి. ప్రచార గడువు ఈనెల 9తో ముగుస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
– గజ్వేల్


