మధ్యవర్తిత్వమే ఉసురు తీసింది
● దంపతులను బలిగొన్నస్నేహితుల మోసం, ఆర్థిక ఇబ్బందులు ● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూతురు ● జెజ్జంకిలో తీవ్ర విషాదం
బెజ్జంకి(సిద్దిపేట): స్నేహితుడిని ఆదుకునేందుకు వహించిన మధ్యవర్తిత్వం దంపతుల ఆత్మహత్యకు కారణమైంది. ఈ ఘటన ఆదివారం బెజ్జంకి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నమ్మిన స్నేహితుల మోసం, ఆర్థిక ఇబ్బందులతో వడ్లకొండ శ్రీహర్ష(33), భార్య రుక్మిణి (28) క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి కుమార్తె హరిప్రియకు తాపి ఉంటారన్న అనుమానంతో సిద్దిపేట ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. దాచారం గ్రామానికి చెందిన శ్రీహర్ష బెజ్జంకిలో భార్య, కుమార్తెతో కలిసి అద్దెకు ఉంటూ రెడీమేడ్ డ్రెస్సెస్ షాపు నిర్వహిస్తున్నారు. శ్రీహర్ష స్నేహితుల వద్ద రూ.13 లక్షల అప్పుల వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్నాడు. దీంతో అప్పుల వారి ఒత్తిడితో.. తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై భార్య, కూతురుతో సహా క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తాను రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. భార్య రుక్మిణి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీహర్ష కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీహర్ష రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నమ్మిన మిత్రుల వల్లే నాకు ఈపరిస్థితి వచ్చిందని తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాల’ని సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని ఏసీపీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య పరిశీలించారు.
మధ్యవర్తిత్వమే ఉసురు తీసింది


