సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
కోహీర్‌లో చలిమంట కాచుకుంటున్న ప్రజలు
పల్లెకు పట్టాభిషేకం
నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు
దుబ్బాకటౌన్/చిన్నకోడూరు(సిద్దిపేట): కొత్త పాలకవర్గాలు కొలువు దీరేందుకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. సోమవారం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట, హుస్నాబాద్ డివిజన్లలో 508 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి.
ప్రత్యేకాధికారుల పాలనకు తెర
ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల అయ్యేందుకు మార్గం సుగమం కానుంది. రెండేళ్లుగా గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాయి. వారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండకపోవడంతో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాలనా వ్యవహారాలు పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారిందని ప్రచారం. గ్రామ పాలకులు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ, తాగునీరు, ఇతర అవసరాలకు డబ్బు లేకపోవడంతో కార్యదర్శులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. వడ్డీలకు డబ్బు తెచ్చి జీపీలను నడిపించారని జోరుగా ప్రచారం సాగింది. వీటిలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. కొత్త సర్పంచ్‌లు వస్తే అభివృద్ధి జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
అద్దె భవనాల్లో ఏర్పాట్లు..
చిన్నకోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో అద్దె భవనాల్లో ఏర్పాట్లు చేశారు. కొన్ని గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నూ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రమంలో గ్రామాల్లో సందడి నెలకొంది.
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


