చేయిచేయి కలిపారు.. ‘మురుగు’ తరలించారు
● దశాబ్దాల పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం ● ఆదర్శంగా చౌదరిపల్లి వాసులు
వర్గల్(గజ్వేల్): మురుగుకాలువ సదుపాయం లేక సతమతమయ్యారు. మురుగు దుర్గంధంతో తల్లడిల్లిపోయారు. పట్టించుకునేవారు లేరని ఆవేదన చెందారు. తలో పైసా పోగేసుకున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న పారిశుధ్య సమస్య పరిష్కరించుకున్నారు.
గజ్వేల్–వర్గల్ రోడ్డు మార్గంలో వర్గల్ మండలం చౌదరిపల్లి చౌరస్తా ఉంది. మెయిన్‌రోడ్డు ఆనుకుని చాలా ఇళ్లు ఉంటాయి. ఆ ఇళ్ల నుంచి వృథానీరు వెళ్లేందుకు సైడ్ డ్రైయిన్లు (మురుగు కాలువలు) లేవు. ఇంట్లో నీరు ఇంటి ప్రాంగణంలోనే నిలిచిపోయి, వర్షకాలంలో వరదనీరు తోడై దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సివచ్చేది. పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా, దశాబ్దాలు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆ ఇళ్ల యజమానులు రూ. 40,000 దాకా పోగేశారు. పైపులు, ఛాంబర్లు తెప్పించారు. ఇళ్ల ముందు నుంచి చౌరస్తా వద్ద మెయిన్‌లైన్‌లోకి మురుగునీరు వెళ్లిపోయేలా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించుకున్నారు. తమ సమస్య తామే పరిష్కరించుకుని ఆదర్శంగా నిలిచారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాం
చౌదరిపల్లి చౌరస్తాలో చాలా ఇళ్లకు మురుగు నీరు వెళ్లే మార్గం లేదు. వానపడితే ఇళ్లల్లోకి నీరు వస్తుండే. వాసన, దోమలతోని బాధలు పడ్డాం. ఎవరికీ చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో డబ్బులు జమ చేసి రోడ్డు పక్కన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాం. మురుగు బాధ నుంచి బయటపడ్డాం.
– తుమ్మ వెంకటేశ్, చౌదరిపల్లి చౌరస్తా
చేయిచేయి కలిపారు.. ‘మురుగు’ తరలించారు


