మల్లన్న జలాలు ఇక బిరబిర
మంచినీటి పథకానికి శ్రీకారం
● నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ● హైదరాబాద్ మహానగరానికి తరలింపు పనులు ప్రారంభం ● ఏటా 20 టీఎంసీల నీటి తరలింపే లక్ష్యం
మల్లన్న జలాలు ఇక పరుగులు పెట్టనున్నాయి. నీటి పథకానికి జిల్లాలో శ్రీకారం చుట్టారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది. హైదరాబాద్ మహా నగరం మంచినీటి అవసరాలను తీర్చేందుకు, అలాగే మూసీ సుందరీకరణకు ఆధారమైన మల్లన్నసాగర్ జలాల తరలింపు పనులు ప్రారంభమయ్యాయి. గజ్వేల్ ప్రాంతంలోని పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో ఇందుకు సంబంధించిన పైప్‌లైన్ పనులు కొన్ని రోజుల కిందట మొదలుపెట్టారు. రూ.4500కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర జరగనున్నాయి. – గజ్వేల్
జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నేడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు కల్పతరువుగా మారింది. ఉత్తర తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా 50టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్... తాజాగా రాజధానికి గొంతు తడపటానికి ఉపయోగపడబోతోంది. ప్రస్తుతం కృష్ణ, మంజీర నదులు, ఎల్లంపల్లిబ్యారేజీతోపాటు గండిపేట రిజర్వాయర్ల నుంచి మంచినీటి సరఫరా జరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న నగర నీటి అవసరాలను అంచనా వేస్తూ.. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్(హెచ్‌ఎండబ్ల్యూఎస్) ఆయా వనరుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నది. ఇందులోభాగంగానే జంటనగరాల్లోని వివిధ ప్రాంత్లాల్లో తాగనీటి పరిష్కారం కోసం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని పన్నెండేళ్ల క్రితమే రూ.3,375కోట్ల అంచనాల వ్యయంతో పనులు చేపట్టి పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి ఏటా 10టీఎంసీల నీటిని హైద్రాబాద్‌కు తరలిస్తున్నారు. అయినా మహానగర దాహార్తికి తిప్పలు తప్పడం లేదు. క్రమంలోనే మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి ఇటీవల రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.
మల్లన్నసాగర్ మంచినీటి పథకానికి సంబంధించిన పనులు గజ్వేల్ ప్రాంతంలో పాతూరు కూరగాయల మార్కెట్ పక్కన కొన్ని రోజుల కిందట ప్రారంభమయ్యాయి. గతంలో ఉన్న ఎల్లంపల్లి పైప్‌లైన్‌కు సమాంతరంగా ఈ పనులు చేపడుతున్నారు.
మల్లన్న జలాలు ఇక బిరబిర


