రాజీమార్గమే ఎంతో మేలు
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● జాతీయ లోక్ అదాలత్‌లో 2,420 కేసులు పరిష్కారం
సిద్దిపేటకమాన్: రాజీయే రాజ మార్గమని లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా న్యాయమూర్తులు పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో 2,420కేసులు పరిష్కారమైనట్లు వీటిలో 45 సివిల్, 16 మోటారు ప్రమాద కేసుల్లో రూ.1,34,75,000 పరిష్కరించినట్లు తెలిపారు. 67బ్యాంకు పీఎల్‌సీ కేసుల్లో రూ.26,97,267 పరిష్కరించారన్నారు. లోక్ అదాలత్ సందర్భంగా పీవీ నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ సుధాకిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డోనేషన్ క్యాంపులో 62యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.


