మల్లన్నసాగర్ పథకం తీరు ఇదీ..
మల్లన్నసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 50 టీఎంసీల్లో హైదరాబాద్ మహానగర అవసరాలకు ఏటా 20 టీఎంసీలను వాడుకోవాలని పథకం రూపొందించారు. రూ.4,500 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైపులైన్‌ల పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు వెళ్తున్న ఎల్లంపల్లి లైన్‌కు సమాంతరంగా మరో కొత్త పైప్‌లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ముందుగా మల్లన్నసాగర్ నుంచి మేడ్చల్ జిల్లా ఘనపూర్ వరకు సమారుగా 100 కిలోమీటర్ల మేర 4 డయామీటర్ల పైప్‌లైన్ నుంచి నిర్మించి అక్కడ ప్రత్యేక డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) నిర్మించాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నగరంలోని ఉస్మాన్‌నగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌లను నింపాలనుకుంటున్నారు. ఇందుకోసం అవుటర్ రింగు రోడ్డు గుండా పైప్‌లైన్ నిర్మాణం జరగనుంది. దీంతోపాటు మూసీ నది సుందరీకరణకు సైతం ఈ జలాలను తరలించే ప్రత్యేక కార్యాచరణ ఈ పథకంలో ఉంది. మొత్తంగా 198కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.


