ఓటుకు 74 వేల మంది దూరం
సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతో మంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే.. అలాంటిది జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో పల్లె ఓటర్లు 74,527 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీలలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 88.30శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం. చాలా చోట్ల అభ్యర్థులే నేరుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
5,62,518 మంది ఓటేశారు..
జిల్లా వ్యాప్తంగా 508 సర్పంచ్‌లు, 4,508 వార్డు సభ్యులకు ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా 39 సర్పంచ్ స్థానాలకు, 729 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 469 సర్పంచ్ స్థానాలకు 1,653 మంది, 3,779 వార్డులకు 9,835 మంది పోటీ చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సర్పంచ్, వార్డు లలో మొత్తం 6,37,045 ఓటర్లు ఉండగా అందులో 5,62,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పురుషులే అధికం
పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో మహిళల కంటే పురుషులే అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 3,12,530 మంది ఓటర్లుండగా 2,78,265 (89.03 శాతం), మహిళలు 3,24,509 మంది ఓటర్లుండగా 2,84,250 (87.59 శాతం) మంది ఓటు వేశారు. జిల్లాలో అత్యధికంగా మూడో విడతలో జరిగిన కుకునూరుపల్లి మండలంలో 91.08శాతం మంది, అత్యల్పంగా మొదటి విడతలో జరిగిన జగదేవ్‌పూర్‌లో 84.27శాతం మంది ఓటు వేశారు.
విడతల వారీగా ఇలా..
విడత పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
మొదటి 80,413 81,557 01 1,61,253
రెండో 1,06,360 1,09,934 0 2,16,294
మూడో 91,492 92,759 02 1,84,253
ఓటరు జాబితా తప్పుల తడక
మృతి చెందిన, డబుల్ ఓటర్ల పేర్లను గ్రామీణ ఓటరు జాబితాలో నుంచి తొలగించలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మృతిచెందిన ఓటర్లను ఓటరు జాబితా సవరణల సమయంలో బీఎల్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు తొలగించాలి. కానీ చేయలేదు. ఉదాహరణకు కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో 1,325 ఓటర్లు ఉండగా అందులో దాదాపు 110 వరకు ఓటర్లు మృతి చెందినవారి, డబుల్, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారి పేర్లను తొలగించలేదు. దీంతో ఆ గ్రామంలో 74శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలింది. ఇప్పటికై నా చనిపోయిన ఓటర్లు, డబుల్ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.


