ఫుల్లుగా తాగించారు
● ‘స్థానిక ’ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం ● జిల్లాలో రూ.69.95కోట్ల మద్యం అమ్మకాలు ● గత నెలతో పోలిస్తే ఈ నెలలో భారీగా విక్రయాలు
సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు మద్యానికే భారీగా డబ్బు వెచ్చించినట్లు సమాచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. కుల, యువజన సంఘాలను ఏకం చేస్తూ వారికి పలు విధాలుగా హామీలు ఇచ్చారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఓటర్లకు రోజూ బిర్యానీ, మద్యంతో దావత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేశారు. కొన్నిచోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
పెరిగిన అమ్మకాలు
జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో 93 వైన్ షాపులు, 16 బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం ఇటీవల మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఈ నెల 1వ తేదీ నుంచి అమ్మకాలు జరుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపుల నుంచి 15రోజులుగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇటీవల నూతన పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ కట్టడి చేసినప్పటికీ రకరకాల పద్ధతుల ద్వారా మద్యం సరఫరా చేశారు. జిల్లాలో గత నెల నవంబర్‌లో రూ.53.44కోట్ల విలువగల 68,682 కేసుల లిక్కర్, 84,037 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల డిసెంబర్‌లో ఇప్పటి వరకు రూ.69.95కోట్ల విలువగల 74,678 కేసుల లిక్కర్, 79,828 కేసుల బీర్లను విక్రయించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
భారీగా మద్యం విక్రయాలు
మద్యం దుకాణాల ద్వారా ఈ నెలలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నూతన షాప్‌లు కావడంతో ఈ నెలలో ఇప్పటి వరకు 74,678 కేసుల లిక్కర్, 79,828 కేసుల బీర్లు విక్రయించారు. మొత్తం రూ.69.95 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో చివరి వారంలో విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లైసెన్స్‌దారులు నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరపాలి. – శ్రీనివాసమూర్తి,
జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్
ఫుల్లుగా తాగించారు


