పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలుపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. రుణమాఫీ, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ రాయితీ, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ తదితర పథకాలతో గ్రామీణ సమాజంలో గొప్ప పరివర్తన వస్తోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతు న్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ జగదేవ్‌పూర్ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ని ఎత్తివేసేందుకు కుట్ర: సీఐటీయూ
గజ్వేల్: పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి మండిపడ్డారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకువస్తున్నారని చెప్పారు. పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల పోరాటాల ఫలితంగా 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల నిరుపేద కూలీలకు భారీ ప్రయోజనం కలిగిందన్నారు. 2014నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా ఈ పథకాన్ని నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉపాధిహామీ బిల్లును మార్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
సీఎం దృష్టికి
బీడీ కార్మికుల సమస్యలు
దుబ్బాక: బీడీ కార్మికుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. బుధవారం తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు(ఐఎన్‌టీయూసీ) తుమ్మ శంకర్ ఆధ్వర్యంలో మైనంపల్లిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల సమస్యలను తెలుసుకున్న యన తప్పకుండా న్యాయం చేస్తామని హామీనిచ్చినట్లు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.


