గెలుపెవరిదో?
గ్రామాల్లో జోరుగా చర్చ
అందరిలో ఉత్కంఠ
కలెక్టర్ హైమావతి
ఎన్నికల సామగ్రి పంపిణీకేంద్రాల పరిశీలన
హుస్నాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న చర్చ గ్రామాల్లో జోరుగా జరుగుతోంది. మొదటి, రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మూడో విడత ఎన్నికల్లోనూ ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత గ్రామాల్లో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే మందు, నగదు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పల్లె ఎవరికి పట్టం కడుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు గజగజ వణికే చలి, మరో వైపు నరాలు తేగే ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నా మద్యం, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. హుస్నాబాద్ మండలం కూచనపల్లిలోని ఓ తోటలో పంపిణీకి సిద్ధం చేసిన డబ్బులు, మద్యం బాటిళ్లను సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా పట్టుకున్నారు. పోలీసులు డేగ కన్ను వేసినా.. ఆయా గ్రామాల అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బులు అందజేస్తున్నట్లు వినికిడి. ఏది ఏమైనా మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవిత్యం తేలనుంది.
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు
కొండపాక(గజ్వేల్): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాక, కుకునూరుపల్లి మండలంలో జరిగే మూడో విడత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల డ్యూటీ నిర్వహణలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్‌కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ చెక్‌చేసుకోవాలన్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాలన్నారు. ప్రతీ రెండు గంటలకోమారు పోలింగ్ శాతాన్ని అందించాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌటింగ్ ప్రక్రియకు మొదలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ప్రక్రియ నిర్వహించాలి
మద్దూరు(హుస్నాబాద్): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేస్తూ ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పోలింగ్ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే అబ్జర్వర్ అనుమతితో మాత్రమే ఫలితాలు విడుదల చేయ్యాలని తెలిపారు.
గెలుపెవరిదో?


