ఫార్మర్ ఐడీ తప్పనిసరి
● రైతులు నమోదు చేసుకోవాలి ● జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాల ద్వారా లభించే రాయితీలు, సబ్సిడీలు పొందాలంటే ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి మంగళవారం తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిని, సమీపంలోని మీ సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చన్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం సహాయం పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని తెలిపారు. రైతుల వివరాలు కచ్చితంగా నమోదు కావడం వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. బీమా, సబ్సిడీలు, రుణాలు తదితర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన అందుతాయని తెలిపారు. ఒకే ఫార్మర్ ఐడి ద్వారా లబ్ధి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుందని, భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు సులభంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. సరైనా గుర్తింపు ఉండటం వల్ల మోసాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్‌కు ఆధార్ కార్డు నంబర్, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. సమీపంలోని మీ సేవ కేంద్రాలలో కేవలం రూ.15 చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పించామని, అలాగే రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా ఉచితంగా ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.


