‘గిరి’ ప్రదక్షిణం
● ధనుర్మాసోత్సవ సంరంభం ● వైభవంగా స్వాతి నక్షత్ర మహోత్సవం ● నాచగిరిలో ఆధ్యాత్మిక వైభవం
వర్గల్(గజ్వేల్): ‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. ధనుర్మాసోత్సవ ప్రారంభ వేళ.. హరిహరుల నెలవు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి భక్తజన సందోహమైంది. భక్తజన సామూహిక విజయాచల గిరి ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. రంగం పేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, అర్చక వేదపండితులు, సిబ్బంది, భక్తజన పరివారం తోడుగా మంగళవారం స్వాతి నక్షత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7.30 గంటలకు పీఠాధిపతి కార్యక్రమం ప్రారంభించగా, భక్తజన హర్షధ్వానాలు, భజనలు, నారసింహ స్మరణల మధ్య గిరి ప్రదక్షిణ సంరంభం ఆద్యంతం నేత్రపర్వం చేసింది. ధనుర్మాసోత్సవంలో గిరి ప్రదక్షిణ అత్యంత శుభకరమని పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి అన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం అనుగ్రహ భాషణం చేశారు. భక్తులు నృసింహుని దర్శించుకుని తరించారు. మహాప్రసాదం స్వీకరించారు.
‘గిరి’ ప్రదక్షిణం


