కావేరి యూనివర్సిటీకి బెస్ట్ అవార్డు
వర్గల్(గజ్వేల్): మండల పరిధి గౌరారం కావేరీ యూనివర్సిటీకి ‘తెలంగాణ బెస్ట్ యూనివర్సిటీ’ అవార్డు లభించినట్లు వర్సిటీ ఛాన్స్‌లర్ జీవీ భాస్కర్‌రావు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని వెటరన్స్ ఇండియా, ఏఐసీటీఈ, ఎన్‌బీఏ, ఏఐయూ, ఈపీఎస్‌ఐ సంయుక్తంగా దేశభక్తి తదితర అంశాలు ప్రాతిపదికన నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్– 2025లో కావేరీ యూనివర్సిటీ ‘తెలంగాణ బెస్ట్ యూనివర్సిటీ’గా ఎంపికైందన్నారు. విజయ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్‌రావు ఈ అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నా రు. అవార్డు రావడంపై రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పొలసాని, డీన్లు డాక్టర్ కొండా శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్ కుమార్‌రెడ్డి, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
అజ్ఞానం వీడితేనే ప్రశాంతత
మిరుదొడ్డి(దుబ్బాక): మన చుట్టూ ఆవరించిన అజ్ఞాన పొరలను తొలగించినప్పుడే మనసుకు ప్రశాంత లభిస్తుందని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిర్వహిస్తున్న గీతా పారాయణం 16వ అధ్యాయం ముగింపు సందర్భంగా మంగళవారం భక్తులకు ఆయన అనుగ్రహభాషణం చేశారు. పారాయణంలో పాల్గొన్న మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి భావం కలిగిన పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లుతాయన్నారు. దైవ చింతన కలిగి ఉండటంతో పాటు, సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు: సీపీ విజయ్‌కుమార్
సిద్దిపేటకమాన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటివి చేయకూడదన్నారు. మొదటి దశ ఎన్నికల రోజు ఉల్లంఘన కేసులు 20, రెండో దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.
వ్యాధిగ్రస్తుల గుర్తింపు
పకడ్బందీగా చేపట్టాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్థుల గుర్తింపు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14రోజుల పాటు 273మంది ఆరోగ్య పర్యవేక్షకుల ఆధ్వర్యంలో, 822మంది ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తిమ్మిర్లు, వంటి సమస్యలు గుర్తించి నమోదు చేసుకుంటారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ మేరకు మందులు పంపిణీ చేస్తామన్నారు. చికిత్స ద్వారా ఈ వ్యాధి ఆరు నెలల నుంచి 12 నెలల్లో నయమవుతుందన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
జిల్లాస్థాయి అబాకస్ పోటీలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విశ్వం ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో అబాకస్ వేదిక్ మ్యాథ్స్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని 30 పాఠశాలలకు చెందిన 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 26 మంది విద్యా ర్థులకు బహుమతులు అందించారు. వారంతా జనవరిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీ లలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


