ఆఖరి పోరు.. పంపకాల జోరు
ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థుల చివరి అస్త్రం 150 సర్పంచ్ స్థానాల్లో 587 మంది పోటీ 1,182 వార్డులకు 3,308 మంది బరిలో.. రేపే చివరి విడత పంచాయతీ ఎన్నికలు
ముగిసిన మూడో విడత ప్రచారం
ఎన్నికల ప్రచారం ముగిసింది. మైక్‌లు మూగబోయాయి. ఇక మిగిలింది బేరసారాలు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మందు, విందులకు గ్రామాలు వేదికగా మారుతున్నాయి. ప్రతి గడప తడుతూ ‘మీ ఓటు మాకే వేయాలంటూ..’ డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వినికిడి. కుల సంఘాలను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి ఇంటికి కిలో మాంసం, క్వార్టర్ మందు సీసా చేతిలో పెట్టి వేడుకుంటున్నారు. సమయానికి అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లేక పోవడంతో వ్యవసాయ భూములు, ప్లాట్లు అమ్ముతున్నట్లు సమాచారం. తమకు ఉన్న పరపతితో వడ్డీలకు డబ్బులు తెచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.2వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి కుటుంబ సభ్యులతో రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లు ఏది అడిగితే అది కాదనకుండా ఇంటి ముంగిటకే తెచ్చి పెడుతున్నారు. మరో వైపు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుండటంతో మద్యం, డబ్బులు పంపిణీ గుట్టుగా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
అభ్యర్థుల బల ప్రదర్శన
ప్రచారం చివరి రోజు సోమవారం అభ్యర్థులు బల ప్రదర్శన చేశారు. గ్రామాల్లో సమావేశాలు పెట్టి తాము గెలిస్తే ఏమేమి అభివృద్ధి పనులు చేస్తామో ఎల్‌ఈడీల ద్వారా హామీలు గుప్పిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారానికి ఊపు తెచ్చారు. ‘ఒక్కసారి అవకాశం ఇవ్వండి సమస్యలు తీరుస్తా’మని హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటుగా మిగతా అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పార్టీలకతీతంగా అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే, మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. మూడో విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
జోరందుకున్న ప్రలోభాల పర్వం
ప్రధాన పార్టీల ర్యాలీలు
చేర్యాల(సిద్దిపేట): ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో గ్రామాల్లో ఎవరికి వారు వారివారి మద్దతు దారులతో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డుల స్థానాల్లో అభ్యర్థులు తమ గుర్తులతో కూడిన నమూనా బ్యాలెట్ పత్రాలతో ఓటర్ల వద్దకు వెళ్లి తమకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది, బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం ఒక్క రోజే కీలకం. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు డబ్బు, మద్యం జోరుగా పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మూడో విడతలో 9 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డు స్థానాలున్నాయి. వీటిలో 13 మంది సర్పంచ్‌లు, 249 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 సర్పంచ్‌లకు 587 మంది, 1,182 వార్డు స్థానాలకు 3,308 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. –హుస్నాబాద్
ఆఖరి పోరు.. పంపకాల జోరు


