మూడో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ హైమావతి ● జూమ్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 17న అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొండపాక, కుకునూరుపల్లి, మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొత్తంగా 3,841 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 1,432 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత, డీపీఓ రవీందర్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఈడీఎం ఆనంద్, జెడ్సీ సీఈఓ రమేశ్, ట్రైనీ డీపీఓ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వసతులు కల్పించండి
చేర్యాల(సిద్దిపేట): మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సోమవారం చేర్యాల మండలం గుర్జకుంట, వేచరేణి, కడవేర్గు, నాగపురి, ముస్త్యాల, ఆకునూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్‌కు పెట్టేందుకు సౌకర్యంగా ఉండాలన్నారు. లైవ్ వెబ్ కాస్టింగ్ కోసం నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్ కోసం సౌకర్యంగా ఉండేలా పెద్ద గదిని ఎంచుకోవాలని ఆయా ఎంపీడీఓలను ఆదేశించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ 100 శాతం చేయాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో ఎవరికి ఫోన్ అనుమతి లేదని, చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ, ఎంపీఓ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.


