లోకల్ ఫైట్..గులాబీ హిట్
డబుల్ డిజిట్‌లో స్వతంత్రులు
రెండో విడతలో బీఆర్‌ఎస్ 119.. కాంగ్రెస్ 33 స్థానాల్లో గెలుపు
సిద్దిపేటజోన్: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులదే హవా కొనసాగింది. ఆదివారం పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు.
బీఆర్‌ఎస్ 119 స్థానాల్లో.. కాంగ్రెస్ 33 స్థానాల్లో, బీజేపీ 13 స్థానాల్లో, ఇండిపెండెంట్‌లు 17 స్థానాల్లో విజయం సాధించారు. గులాబీకి పట్టు న్న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. బెజ్జంకి మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. మరోవైపు బీజేపీ నామమాత్రంగా ప్రభావం చూపగా, స్వతంత్ర అభ్యర్ధులు డబుల్ డిజిట్‌లో గెలుపొందారు. సిద్దిపేట పట్టణ సరిహద్దులోని కొన్ని మేజర్ గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది.
సిద్దిపేటలో కొనసాగిన హవా..
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో బీఆర్‌ఎస్ ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పించింది. కొన్ని రోజులుగా గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పోటీల్లో బీఆర్‌ఎస్ పార్టీ అనుచరులు అధిక సంఖ్యలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. చివరకు బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావుపేట మండలాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌కు 76 స్థానాలు రాగా కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ డిజిట్ కూడా దక్కలేదు.
బెజ్జంకిలో కాంగ్రెస్ ప్రభావం..
మానకోడూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. 13స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 8స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలిచింది. ఇక్కడ మూడు చోట్లా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
వికసించని కమలం
ప్రజాప్రతినిధుల పట్టు
రెండో విడత ఓట్ల లెక్కింపులో ప్రజాప్రతినిధులు సొంత గ్రామాల్లో పట్టు సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింత మడకలో బీఆర్‌ఎస్, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లిలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.


