ఊళ్లు.. ఓటెత్తాయ్..
172 సర్పంచ్, 1,371 వార్డులకు ఎన్నికలు ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్, సీపీ
సిద్దిపేటజోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2,44,776 ఓట్లకు గాను 2,16,294 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 88.36 పోలింగ్ శాతం నమోదైంది. ఏకగ్రీవమైన స్థానాలను మినహాయించి 172 సర్పంచ్ స్థానాలకు, 1,371 వార్డులకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, నంగనూరు, చిన్నకోడూరు మండలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూపల్లి, మానకోడూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండలాల్లో పోలింగ్ నిర్వహించారు.
ఆదివారం జరిగిన రెండో విడత పోలింగ్ ప్రక్రియ మెల్లమెల్లగా పుంజుకుంది. నిర్ణీత సమయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి గంట పోలింగ్ శాతం కొద్దిగా నెమ్మదించిన తర్వాత పుంజుకుంది. 9గంటల వరకు సగటున 23శాతం చేరుకుంది. వీకెండ్ కావడంతో పాటు రెండో శనివారం రావడం ఓటర్లకు కలిసి వచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం ఓటు వేసేందుకు స్వగ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయం గడువు దాటినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ కట్టారు. వారందరికీ అధికారులు అవకాశం కల్పించారు. షెడ్యూల్ మేరకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోలింగ్ సరళిని కలెక్టర్ హైమావతి, పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ప్రశాంతంగా రెండో విడత పోలింగ్
పది మండలాల్లో ఓటర్ల సంఖ్య: 2,44,776
పురుషులు: 1,19,471
మహిళలు: 1,25,304
ఇతరులు: 01
పోలింగ్ శాతం సరళి..
ఉదయం 9 వరకు
పోలైన ఓట్లు: 56,905 (23.25)
11 గంటల వరకు.. 1,43,027 (58.43)
ఒంటి గంట వరకు
పోలైన మొత్తం ఓట్లు: 2,16,294 (88.36)
జిల్లాలో 88.36 శాతం నమోదు
మండలాల వారీగా పోలింగ్ శాతం..
అక్బర్ పేట–భూపల్లి: 87.63
బెజ్జంకి: 85.89
చిన్నకోడూరు: 87.99
దుబ్బాక: 86.91
మిరుదొడ్డి: 87.70
నంగునూరు: 90.16
నారాయణరావు పేట: 89.78
సిద్దిపేట రూరల్: 89.52
సిద్దిపేట అర్బన్: 89.30
తొగుట: 89.74


