ఖాజీపూర్‌లో ఉద్రిక్తత
పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు అభ్యర్థులను పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో అభ్యర్థులు, పోలీసులకు మధ్య మాటా మాటా పెరిగి చివరికి వాగ్వాదానికి దారి తీసింది. ఘటనా స్థలంలో జనాలు గుమిగూడటంతో ఉద్రిక్తతంగా మారింది. పరిస్థితి చేయి దాటక ముందే పోలీసులు.. అభ్యర్థులను, గ్రామస్తులను చెదర గొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మిరుదొడ్డిలో పోలీసుల అత్యుత్సాహం
మండల కేంద్రమైన మిరుదొడ్డిలో వార్తా సేకరణకు వెళ్లిన విలేకరులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రానికి సుమారు వెయ్యి మీటర్ల దూరంలో ఫొటోలు తీస్తున్న విలేకరులను వారిస్తూ వారి నుంచి అక్రిడిటేషన్ కార్డులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ఫొటోలను డిలేట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన విలేకరులపై విరుచుపడ్డారు. చివరికి ఎస్‌ఐ సమత జోక్యంతో సమస్య సద్దుమణిగింది. సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన పోలీసులే సమస్యలకు కారణమవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


