సమష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేయండి
● మీకు సంపూర్ణ సహకారం అందిస్తా ● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని 91 గ్రామాలకు 77 గ్రామ పంచాయతీలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని, గొప్ప విజయమని, మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ బలపర్చిన వారు తమ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించి సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందగా, కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్లుగా మన తెలంగాణ రాష్టానికి ఒక్క అవార్డు రాలేదన్నారు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమని దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ఐక్యతతో పనిచేయాలని సూచించారు.
కోలాహలంగా క్యాంపు కార్యాలయం
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ఈ నేపథ్యంలో గెలిచిన వారంతా పెద్ద ఎత్తున అనుచరులతో క్యాంపు కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున కోలాహలంగా మారింది. తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన వారికి ఆప్యాయంగా పలకరించి, అభినందించారు. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు స్వీట్స్ పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకున్నారు.


