ఓట్ల బేరం!
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జోరుగా ప్రలోభాల పర్వం
● ముగిసిన మొదటి విడత ప్రచారం ● 147 సర్పంచ్ పదవులకు 481 మంది పోటీ ● 1,208 వార్డులకు 2,972 మంది బరిలో.. ● రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు
నేరుగా ఓటరును కలిసి..
గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి విడతలో జరిగే పంచాయతీల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఇక పోటీ చేసే అభ్యర్థులు.. ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, డబ్బుల పంపిణీకి ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. – సాక్షి, సిద్దిపేట
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ నెల 3న నామినేషన్ల విత్‌డ్రా, మధ్యాహ్నం 3గంటలకు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. మొదటి విడతలో జరిగే వాటిలో 16 సర్పంచ్‌లు, 224 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 147 సర్పంచ్‌లకు గాను 481 అభ్యర్థులు, 1,208 వార్డు సభ్యులకు 2,972 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హోరాహోరీగా ప్రచారం
మొదటి విడత గ్రామ పంచాయతీల్లో ప్రచారం మంగళవారం చివరి రోజు హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికలు తలెదన్నేలా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటికీ ఓట్లను అభ్యర్థించారు. ఉన్న సమయంలో ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. తమను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే కాకుండా మిగతా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.
పోలింగ్ ఏర్పాట్లు
మొదటి విడత గ్రామాల్లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
ఓటరును నేరుగా కలిసి డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పెద్ద గ్రామ పంచాయతీలలో ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 వరకు అందజేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల పై నిఘా ఉండటంతో తమకు దగ్గరగా ఉన్న బంధువులు, స్నేహితుల ద్వారా డబ్బులను సర్దుబాటు చేసుకుంటున్నారు. పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తుండటంతో మద్యం, డబ్బులు ఎలా పంపిణీ చేయాలని తర్జనభర్జన చెందుతున్నారు.
ఓట్ల బేరం!


