సమీపిస్తున్న పరీక్షలు.. ఎన్నికల విధుల్లో టీచర్లు
సంక్రాంతికి ముందే సిలబస్ పూర్తి అయ్యేది..
● జిల్లాలోని 508 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,886 మంది ఉపాధ్యాయులు విధుల్లో కొనసాగుతున్నారు.
● ఈ నెల 11, 14, 17న విడతల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికానున్నాయి.
● అప్పటి వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
● దీంతో పదోతరగతి బోధన ఆలస్యం అవుతుంది.
● ప్రతి విద్యా సంవత్సరం సంక్రాంతి పండుగ సెలవులకు ముందుగానే సిలబస్ పూర్తి చేసేవారు.
● కానీ ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 75శాతం వరకే సిలబస్ పూర్తయ్యింది. సంక్రాంతి లోగా మిగతా 25శాతం సిలబస్ పూర్తవుతుందా అనేది అనుమానంగా మారింది.
● సిలబస్ పూర్తయితేనే విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది.
● త్వరగా సిలబస్ పూర్తయితేనే తమ పిల్లలు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
● మార్చిలోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిలబస్ త్వరగా పూర్తయితేనే, విద్యార్థులు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడానికి అవకాశం ఉంటుంది.
● అయితే సంక్రాంతిలోగా పదోతరగతి సిలబస్ పూర్తి అవుతుందని, పూర్తియ్యాక పునశ్చరణ తరగతులు ఉదయం, సాయంత్రం వేళ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
విద్యార్థుల్లో గుబులు
సిలబస్ పూర్తయితేనే
పునశ్చరణ తరగతులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల్లో ఎన్నికల గుబులు పట్టుకుంది. ఒకవైపు పరీక్షలు సమీపిస్తుండగా.. మరోవైపు ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు ఉండటంతో గడువులోగా సిలబస్ పూర్తికావడంపై సందిగ్ధం నెలకొంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే నాణ్యమైన విద్యను అందించాలి. అలాగే వారిలో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టాలి. దీంతో వారు పరీక్షలకు సన్నద్ధమై పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అందుకు ముందుగానే పాఠ్యాంశాలు పూర్తి చేసి, విద్యార్థులకు పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులే కీలకం. వీరికి ముందుగానే ఎన్నికల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే ఓటింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. దీంతో పాఠశాలల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటున్నారు.
గడువులోగా
సిలబస్ పూర్తయ్యేనా