ఆఖరి మోఖా..
సెంటిమెంట్ రగిలిస్తూ.. కాళ్లపై మోకరిల్లుతూ..
గజ్వేల్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నిన్నమొన్నటి వరకు నిత్యం ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు.. పోలింగ్‌కు ఇక ఒకే ఒక్క రోజు మిగిలి ఉండటంతో అఖరి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలని, అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తున్నారు. కుల సంఘాల ఓట్లను ఇప్పటికే గంపగుత్తగా కొనుగోలు చేసిన అభ్యర్థులు ఈనెల 10 రాత్రి ఓటరు వారీగా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేపట్టడానికి వ్యుహాల్లో ఉన్నారు. కొన్ని ప్రధాన గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.1000–3000 ఇవ్వడానికి సిద్ధమవుతున్న ట్లు ప్రచారం. ఇకపోతే మద్యం కూడా నాణ్య మైన బ్రాండ్లను అందజేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు..
ఓటర్లను వివిధ రూపాల్లో ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. చివరగా సెంటిమెంట్ అస్త్రాన్ని ఓటర్లపై ప్రయోగిస్తున్నారు. ‘అన్ని శక్తులొడ్డి ఎన్నికల్లో దిగినం.. ఇక మీ దయ’ అని కొందరు, ‘మాపై కుట్రలు జరుగుతున్నయ్.. సాదుకున్న మీరే సంపుకున్న మీరే’ అంటూ మరికొందరు, ‘గెలిపిస్తే మిమల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటా’ మని ఇంకొందరు సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే కొందరు అభ్యర్థుల తమకు ఈ ఎన్నికలు చావో.. రేవో అంటూ ప్రతి ఓటరు కాళ్లపై మోకరిల్లుతున్నారు. ఈ సమయంలో కన్నీరు పెడుతూ ఓటు వేయాలని అడుగుతున్నారు.
వినూత్న హామీలపై ఆశలు...
మొదటి విడత ఎన్నికల్లో అభ్యర్థుల వినూత్న హామీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆడపిల్ల పుడితే.. రూ.5000 డిపాజిట్ చేస్తామని, పెళ్లిల్లో ఆడపిల్లకు రూ.5వేల నజరానా ఇస్తామని తదితర వినూత్న హామీలు పనిచేస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. మరికొందరు ఇంకొ అడుగు ముందుకేసి సమస్యల పరిష్కారానికి బాండ్ పేపర్లు రాసిస్తున్నారు.
చివరి రోజు బలప్రదర్శన..
మంగళవారం చివరి రోజు ప్రచారంలో అభ్యర్థులు బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. భారీ ర్యాలీలు, మైక్ ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీలకు సంబంధించిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులను ఈ ప్రచారాల్లో భాగస్వాములను చేశారు. మొత్తానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల పర్వం సర్వత్రా ఆసక్తిని రేకిత్తించింది.
ఎల్లయ్య..
ఎవ్వలకు ఓటేద్దాం..
దుబ్బాకరూరల్: గ్రామాల్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్పికలపైనే చర్చ జరుగుతోంది. సర్పంచ్‌ల ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఎక్కడ చూసినా గ్రామ ప్రజలంతా గ్రామ చావిడి, హోటళ్ల వద్ద గుమిగూడి ముచ్చట్లు పెడుతున్నారు. ‘అవురా.. ఎల్లయ్య మన ఊళ్లో ఎవ్వలకు ఓటు వేద్దాం? ముగ్గురు నిలబడిరి. ఎవ్వలైతే మంచిగుంటదరా’ అంటూ వృద్ధులు ముచ్చటిస్తున్నారు. ‘అరేయ్ మల్లయ్య.. గ్రామాన్ని ఎవ్వలైతే అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేద్దాం రా..’ అంటూ ముచ్చట పెడుతున్నారు. వృద్ధులు ముచ్చట పెడుతున్న ఈ దృశ్యం మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామంలోనిది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు రేపు సెలవు
సిద్దిపేటరూరల్: మొదటి విడతలో భాగంగా ఈనెల 11న జరిగే ఎన్నికల ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గజ్వేల్, మర్కూక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత, వ్యయ పరిశీలకులు నిశాంతి, అదనపు డీసీపీ కుశాల్కర్, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆఖరి మోఖా..
ఆఖరి మోఖా..


