రాష్ట్రస్థాయి కథల పోటీల్లో విద్యార్థి ప్రతిభ
కొండపాక(గజ్వేల్): కొండపాక హైస్కూల్ 8వ తరగతి విద్యార్థి రిత్విక్ తేజ రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో తృతీయ బహుమతికి ఎంపికయ్యాడని హెచ్‌ఎం విఠల్ నాయక్ శుక్రవారం తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల హైదారాబాద్‌లో రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా శుక్రవారం వెలువడిన విజేతల జాబితాలో రిత్విక్ తేజ తృతీయ బహుమతికి ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సాహిత్య అకాడమీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రిత్విక్ తేజ రాష్ట్రస్థాయిలో రాణిస్తూ పాఠశాల, గ్రామం పేరు ప్రతిష్టతలను పెంచాడన్నారు. ఈ సందర్భంగా తెలుగు టీచర్ సత్యలక్ష్మికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


