కందికి సస్య రక్షణ కీలకం
● జిల్లాఓ 15 వేల ఎకరాలలో సాగు ● చీడపీడలతో అప్రమత్తం ● శాస్త్రవేత్త పల్లవి
దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో వర్షాధారంగా సాగుచేస్తున్న పప్పుదినుసుల పంటలో కంది కీలంగా ఉంది. దాదాపు 15 వేల ఎకరాలలో కంది సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ యేడు విత్తుకున్న పంట ప్రస్తుతం పూతదశలో ఉంది. ఈ సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చునని సిద్దిపేట రైతు విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త పల్లవి రైతులకు సూచించారు.
పూత దశలో..
వర్షపాతం లేని చోట పూతకు ముందు 19:19:19 ను 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూతదశలో నీటి ఎద్దడికి గురైనా, పూతదశలో నీరు ఎక్కువైనా పూత రాలిపోతుంది. సరైన సమయంలో నీటి తడులు పెట్టుకోవాలి. ఇసుక నేలల్లో సాగుచేసిన పంటలో ఎక్కువ శాతం పూత రాలిపోయే సమస్య కనిపిస్తుంది. దానిని నివారించడానికి ప్లానోఫిక్స్ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటే పూత, పిందె రాలడాన్ని అరికట్టవచ్చు. కాత ఏర్పడే దశలో పరిస్థితులను అధిగమించేందుకు ఒకసారి (13–0–45) పొటాషియం నైట్రేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
కాయ తొలిచే ఈగ: ఈ ఈగ పూత, లేత కాయలు లేదా పిందెలలో గుడ్లు పెడుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలను తినేస్తాయి. గింజల మీద తెల్లని చారలను ఏర్పరుస్తాయి. ఆశించిన కాయలను బయట నుంచి గుర్తించలేం.
ఫ్యుజేరియం ఎండు తెగులు: కందిలో ప్రధానమైన సమస్య ఫ్యుజేరియం ఎండు తెగులు. ఇది భూమి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు మొలక దశ నుంచి పూత, కాత దశ వరకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ తెగులు లక్షణాలు మొక్కల చిగుర్లు లేదా కొమ్మలు కిందికి వంగి వాడిపోతాయి. క్రమేణా ఆకులన్నీ పండుబారి, మొక్కలు ఎండిపోతాయి.
శనగపచ్చ పురుగు: దీని తల్లి పురుగు మొగ్గలపై లేత పసుపు, తెలుపు రంగు గుడ్లను పెడుతుంది. దీని నివారణకు తొలిదశలోనే వేప నూనె/ వేపగింజల కషాయాన్ని 5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 5 లింగాకర్షక బుట్టలనుఅమర్చాలి.
మారుకా మచ్చల పురుగు: ముఖ్యంగా పూతదశలో మారుకా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశిస్తే మొక్కలలో ఎదుగుదల లోపిస్తుంది. నివారణకు వేప గింజల కషాయం 5శాతం లేదా వేపనూనె (అజాడిరాక్టిన్ 1500 పి.పి.యం.) 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కందికి సస్య రక్షణ కీలకం
కందికి సస్య రక్షణ కీలకం
కందికి సస్య రక్షణ కీలకం


