డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు
గజ్వేల్‌రూరల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడిన ఇద్దరికి న్యాయమూర్తి స్వాతిగౌడ్ నాలుగు రోజుల జైలుశిక్ష విధించారు. ట్రాఫిక్ సీఐ మురళి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడ్డారన్నారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరు పర్చామని, న్యాయమూర్తి వారిలో ఐదుగురికి రూ.50 వేలు, మరో ఇద్దరికి నాలుగు రోజుల జైలుశిక్ష విధించినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేడు విద్యుత్ నిలిపివేత
దుబ్బాక: మండల పరిధిలోని హబ్సీపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనులు నిర్వహిస్తున్న కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని దుబ్బాక సబ్‌డివిజన్ ఏడీ గంగాధర్ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు దుబ్బాక మున్సిపాలిటీ, భూంపల్లి–అక్బర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు మిరుదొడ్డి మండలంలోని ధర్మారం, అందె, కొండాపూర్, కాసులాబాద్ గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్టు తెలిపారు.
సిద్దిపేటలో..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని 11కేవీ వన్‌టౌన్ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగమ్మతోట, చర్వాదాన్, బారాహిమామ్, నాసర్‌పుర, చేపల మార్కెట్ ప్రాంతాలలో శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న గణిత పీజీటీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని, అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సోమవారంలోగా పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని, మంగళవారం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 73823 25007నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి..
సిద్దిపేటజోన్: సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ మాజీ ఎంపీటీసీ నర్సింహులు తిరిగి సొంత గూటికి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్యెల్యే హరీశ్‌రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. హరీశ్‌రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు.


