పాలన భారమాయె.. అప్పులు అధికమాయె
● పంచాయతీ కార్యదర్శులకు నిత్యం గండం ● ‘స్థానిక’ ఎన్నికల వాయిదాతో మరింత ఆందోళన
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామ పంచాయతీ పాలన కార్యదర్శులకు నిత్యం గండంగా మారింది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ఉండటంతో మొత్తం భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. పారిశుద్ధ్య పనులు, నీటి సరఫరా, ఏ చిన్న సమస్య తలెత్తినా కార్యదర్శే డబ్బులు వెచ్చించి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్యదర్శులు తమ జీతాల నుంచి పంచాయతీల్లో చేసే పనులకు పెట్టుబడులు పెడుతూ అప్పుల పాలవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయని భావించినా ఎన్నికలు వాయిదా పడటంతో గ్రామాల్లో నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడుతోంది.
అత్యవసర పనులకు అప్పులు
జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు.. 480 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఆ గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టకపోతే ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో శానిటేషన్, బ్లీచింగ్, విద్యుత్ బల్బుల ఏర్పాటు, మోటార్ల రిపేరు వంటి పనులకు కార్యదర్శులే అప్పులు తెచ్చి పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు, మంజూరైన నిధులకు కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.
నిధులు విడుదల చేయాలి
గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శానిటేషన్, ట్రాక్టర్ రిపేర్లు, డీజిల్ తో పాటు వీధి దీపాలకు ఇబ్బందిగా మారింది. పంచాయతీలకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. – రాజు,
పంచాయతీ కార్యదర్శి, పెద్దకోడూరు


