రైతుల్లో మొంథా కలవరం
జిల్లాలో ఇప్పటికే మొదలైన వర్షం
వరికోతలు కోయవద్దనిఅధికారుల సూచనలు
మొంథా తుపాన్‌తో రైతుల్లో తీవ్ర కలవరం మొదలైంది. తుపాన్ ప్రభావంతో నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ వెలువడుతున్న వార్తలు రైతులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మూడురోజులుగా పడుతున్న వర్షాలతో పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ‘మొంథా’ ప్రభావంతో జిల్లాలో మంగళవారం వర్షపు జల్లులు కురిశాయి. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే కోత దశలో ఉన్న వరిచేన్లు నేలవాలె పరిస్థితి ఏర్పడింది. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. – దుబ్బాక
మొంథా ప్రభావంతో వర్షపు జల్లులు మొదలు కావడంతో ధాన్యం చేతికిరాకుండా పోతుందేమోనన్న బెంగ రైతుల్లో నెలకొంది. జిల్లాలో ఇప్పటికే 407 కోనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా ఇప్పటివరకు 3,483 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రధానంగా దుబ్బాక మార్కెట్ యార్డు, సిద్దిపేట, చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్ మార్కెట్ యార్డులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో 80 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు సమాచారం.
అధికారుల అలర్ట్
తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతాయన్న సూచనలు.. కలెక్టర్ హైమావతి ఆదేశాలతో అధికారులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కుప్పలు చేయిస్తూ తడవకుండా కవర్లను దగ్గరుండి కప్పిస్తున్నారు. దుబ్బాక మార్కెట్‌యార్డులో సుమారు 10 వేల క్వింటాళ్ల వరకు ధాన్యం ఉండటంతో పీఏసీఎస్, ఏఎంసీ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేశారు. వరి కోతలు కోయవద్దని రైతులకు, హార్వెస్టర్ యజమానులకు సూచించారు. ఏదేమైనా మొంథా తుపాన్ ప్రభావం జిల్లాలో ఎలా ఉంటుందోనని, ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతామోనన్న భయం నెలకొంది.
కొనుగోలు కేంద్రాల్లో ఆగమాగం
రైతుల్లో మొంథా కలవరం


