● పురుగు మందు డబ్బాలతోరైతుల నిరసన ● హుస్నాబాద్‌లో సర్వే
హుస్నాబాద్: ‘కాలువల నిర్మాణం కోసం ఇప్పటికే ఒక దఫా భూములిచ్చాం. మళ్లీ ఇవ్వడానికి సిద్ధంగా లేం. ప్రాణాలు పోయినా ఇవ్వబోమ’ని రైతులు తెగేసి చెప్పారు. హుస్నాబాద్ పట్టణం డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల కోసం స్థల సర్వే చేసేందుకు మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వచ్చారు. ఇరిగేషన్ ఏఈ నె హ్రూ, సర్వేయర్ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ రాజయ్యలను సర్వే చేయకుండా అడ్డుకున్నారు. బలవంతంగా సర్వే చేస్తే ఇక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుగుల మందుల డబ్బాలతో నిరసన తెలుపుతూ రోడ్డు పై బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ డీఈఈ ప్రశాంత్‌లు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు ససేమిరా అన్నారు. మా భూముల్లో ఎలాంటి ఆయకట్టు లేదని, ఇళ్ల స్థలాలుగా మారాయన్నారు. ఇండ్ల కోసం స్థలాలు తీసుకున్న వారు వీధిన పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఎకరం, రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ లేదన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, మరో సారి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమన్నారు. కాలువల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అలైన్‌మెంట్ మార్చి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాలువలు నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. మరో వారం రోజుల్లో ఇరిగేషన్ ఈఈ అధికారితో వచ్చి రైతులతో మాట్లాడుతామంటూ అధికారులు వెళ్లి పోయారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, రైతులు మర్యాల రాజిరెడ్డి, మర్యాల మహేశ్వర్ రెడ్డి, బురుగు కిష్టస్వామి, కొరిమి చిదంబరం, లాజరస్, సతీష్ తదితరులు ఉన్నారు.


