తాగి నడిపితే తాట తీస్తాం
మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేల జరిమానా రెండో సారి పట్టుబడితే రూ.15వేలు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్
సిద్దిపేటకమాన్: మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేల జరిమానా లేదా ఆరు నెలలపాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు అమల్లోకి వచ్చాయని ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లాలో తొలిసారిగా కఠిన చర్యలు అమలు చేస్తున్నామన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.15వేల జరిమానా విధించనున్నామన్నారు. రెండేళ్ల జైలు శిక్ష, రెండు ఏళ్ల వరకు లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేయనున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. తరుచూ వాహన తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు.


