
వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి
● త్వరలోనే గత సన్నాల బోనస్ చెల్లిస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్ ● పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం
హుస్నాబాద్: రైతులు వరితో పాటు అధిక దిగుబడి, లాభసాటి వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం పట్టణంలోని గోమాత జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగొలు కేంద్రం, వ్యవసాయ మార్కెట్ యార్డులో విశాల పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగొలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్ట మొదటగా హుస్నాబాద్‌లో సీసీఐ పత్తి కొనుగొలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పత్తి క్వింటాలుకు రూ.8,100 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. 12 రాష్ట్రాల్లో సీసీఐ టపాస్ కిసాన్ మొబైల్ యాప్ కింద ఆన్‌లైన్‌లో ద్వారా జిన్నింగ్ మిల్లు కేంద్రాల్లో పత్తి కొనుగొలు చేస్తున్నారని తెలిపారు. యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. గడిచిన సీజన్‌కు సంబంధించి సన్న వడ్ల బోనస్ డబ్బులను ప్రభుత్వం త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగొలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ అవుతాయన్నారు. నర్మేటలో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే ట్రయల్ రన్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో అద్యక్షుడు బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సీసీఐ కేంద్ర ఇన్‌చార్జి పంకజ్ తదితరులు ఉన్నారు.