
వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హైమావతి ● తొగుటలో ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
తొగుట(దుబ్బాక): పేదలకు మెరుగైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ హైమావతి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సరిపడా మందులు, ల్యాబ్‌లో అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయూష్ కేంద్రంలో యునాని వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. మధ్య వయస్సు వారికి, వృద్ధులకు యునాని మందులు శ్రేష్టమైనవన్నారు. అనంతరం కలెక్టర్ కాలి మడమ నొప్పి వస్తుందని తెలపడంతో యునాని వైద్యురాలు అస్రా పరీక్షించి మాత్రలు అందించారు.
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం వినతి
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బిల్లులు అందక ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని వివరించారు. బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆయన విజ్ఞప్తిచేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపించామని త్వరలోనే మంజూరవుతాయని హమీనిచ్చారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు రాధాకృష్ణ పాల్గొన్నారు.
సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి
సిద్దిపేటరూరల్: రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ – 2047’ సిటిజన్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ హైమావతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు మాత్రమే పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తున్నదని తెలిపారు. గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25వతేదీతో ముగియనున్న సందర్భంగా www.telangana.gov.in/telanganarising అనే వెబ్ సైట్‌ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కలెక్టర్ తెలిపారు.