
ఎవరికి వారు.. పైరవీల జోరు
కొత్తవారికే అవకాశం అంటూ ప్రచారం ఏఐసీసీకి పంపే ఆ ముగ్గురు ఎవరు? జిల్లా కాంగ్రెస్‌లో జోరుగా చర్చ
డీసీసీ అధ్యక్ష పీఠానికి పోటాపోటీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో డీసీసీ అధ్యక్ష పదవికి డిమాండ్ పెరిగింది. పదవి కోసం కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా దరఖాస్తు చేశారు. దాదాపు 127 మందికి పైగా దరఖాస్తు చేసినట్లు విశ్వనీయ సమాచారం. దరఖాస్తు దారుల నుంచి అభిప్రాయలను సైతం సేకరించారు. పరిశీలకులు ఈ నెల 26న ముగ్గురి పేర్లను ఏఐసీసీకి అందించే అవకాశం ఉంది. వారిలో సీఎం, పీసీసీ నేతలతో చర్చించి అధ్యక్షుని పేరును ఈ నెల 30 వరకు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో డీసీసీ పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
–సాక్షి, సిద్దిపేట
డీసీసీ అధ్యక్షుని ఎంపిక కోసం జిల్లాలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించారు. అందులో భాగంగా డీసీసీ పదవిని ఆశిస్తున్న ఆశావహుల నుంచి దరఖాస్తులను ఏఐసీసీ పరిశీలకులు జ్యోతి రౌటేలా, పీసీసీ నుంచి జగదీశ్వరరావు, నజీర్ హుస్సేన్‌లు స్వీకరించారు. ఆ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 18,19వ తేదీలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలువురు దరఖాస్తు దారులతో నేరుగా మాట్లాడారు. ‘మీరు డీసీసీ అధ్యక్షుడైతే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మీకు అవకాశం ఇవ్వకపోతే ఎవరిని సూచిస్తారు? అని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. అలాగే పార్టీ కోసం పని చేస్తున్న నాయకుల గురించి ఆరా తీశారు. అందులో ముందు వరుసలో శ్రావణ్ కుమార్‌రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, పూజల హరికృష్ణ, గిరి కొండల్ రెడ్డి, దరిపల్లి చంద్రం, ఆంక్షారెడ్డి, బండారి శ్రీకాంత్, సూర్య వర్మ, బస్వరాజు శంకర్, శ్రీనివాస్ గుప్తా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరిని సామాజిక వర్గాల వారీగా పేర్లు సైతం పరిశీలించే అవకాశం ఉంది.
సీనియారిటీ పరిగణలోకి..
డీసీసీ అధ్యక్ష పీఠం కోసం సీనియార్టీ సైతం పరిగణలోకి తీసుకోనున్నారు. కనీసం ఐదేళ్ల పాటు పార్టీలో పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ప్రకటించింది. దీంతో కొంతమంది నేతలు తర్జన భర్జన పడుతున్నారు. కొందరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో, మరికొందరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరారు. దీంతో సీనియర్, జూనియర్ అనేది కొత్తగా తెరపైకి వచ్చింది. ఐదేళ్లు సీనియార్టినే ప్రామాణికంగా తీసుకుంటే పలువురు పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది.
పదవికి 127 మంది దరఖాస్తు
ఆ ముగ్గురు ఎవరు?
డీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 127 మంది దరఖాస్తు చేయగా ఏఐసీసీకి పంపే ముగ్గురిలో ఎవరికి అవకాశం దక్కుతుందోనని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. డీసీసీ పదవి దక్కకపోయినా ఏదైనా నామినేట్ పదవికై నా సిఫార్సు చేస్తారేమోనని ఆసక్తి నెలకొంది. ఆ ముగ్గురు నేతలు ఎవరన్నది ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. డీసీసీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పదవిని ఆశిస్తున్న నేతలు పలువురు మంత్రులు, టీపీసీసీలో కీలక నేతలను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
కొత్తవారికే అధ్యక్ష పీఠం
జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్ష పీఠం కొత్తవారినే వరించనుంది. ప్రజాప్రతినిధుల సమీప బంధువులు, ఇప్పటి వరకు పనిచేసిన వారికి రెండోసారి ఎట్టి పరిస్థిల్లోనూ డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోమని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేయడంతో నూతనోత్తేజం నెలకొంది. ఈ నిర్ణయంతో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి కాకుండా కొత్త వ్యక్తికి అవకాశం దక్కనుంది.