మంత్రి వివేక్ సభలో నిలిచిన విద్యుత్ సరఫరా
● సెల్‌ఫోన్ వెలుతురులో చెక్కుల పంపిణీ ● కొద్దిసేపు గందరగోళం
గజ్వేల్: పట్టణంలో బుధవారం రాత్రి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో సాగింది. రాత్రి 7:20 గంటల ప్రాంతంలో మంత్రి వివేక్, కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతో కలిసి పట్టణంలోని ఐవోసీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొద్దిసేపు ప్రసంగించారు. ఇంతలోనే కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో మంత్రితో పాటు వేదికపైన ఉన్న వారు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు వేచి ఉన్నా కరెంటు రాకపోవడంతో మంత్రి వివేక్ చివరకు సెల్‌ఫోన్ లైట్ల వెలుతురుతో పాటు వీడియో కెమరాల లైటింగ్‌లోనే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 204 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా, కొందరికే సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో మంత్రి అందించారు. సుమారు 10 నిమిషాలకుపైగా కార్యక్రమం సాగింది. ఆ తర్వాత కరెంటు సరఫరా రావడంతో మంత్రి మరోసారి వేదికపై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపు ప్రసంగించి కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడానికి గల కారణాలను జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. స్థానిక విద్యుత్‌శాఖ ఏఈ మారుతిని అక్కడికి పిలిపించి వివరణ అడిగారు. ఈ సందర్భంగా ముట్రాజ్‌పల్లిలోని ట్రాన్స్‌ఫార్మర్ ఇన్సులేటర్‌పై బల్లి పడటంతో సరఫరా నిలిచిపోయిందని ఏఈ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మంత్రి సభలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చర్చనీయంశంగా మారింది.


