
చెరువులో స్తంభం ఎక్కి..
తెగిన కరెంటు తీగలు బిగించి..
వర్గల్(గజ్వేల్): జలాశయాల్లో కరెంటు తీగలు తెగిపడిన సందర్భాల్లో మరమ్మతు పనులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది సాహసమే చేయాల్సివస్తున్నది. సోమవారం ఉదయం నెంటూరు 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని జబ్బాపూర్ 11కేవీ ఫీడర్ బ్రేక్‌డౌన్ అయింది. దీంతో లైన్ ఇన్‌స్పెక్టర్ చంద్రయ్య, క్యాజువల్ లేబర్ సతీష్, మీటర్ రీడర్ ధర్మయ్యలు రంగంలోకి దిగారు. ఫీడర్ లైన్ వెంట తనిఖీలు నిర్వహించారు. మైలారం చింతల చెరువులో స్తంభాల మధ్య కరెంట్ తీగ(కండక్టర్) తెగిపోయినట్లు గుర్తించారు. నడుము లోతు నీటిలో 4, 5 గజాల కొత్త కండక్టర్ తీగను తీసుకొని స్తంభం వద్దకు చేరుకున్నారు. బైండింగ్ చేసి తీగను అతికి విద్యుత్ లైన్‌ను యథావిధిగా బిగించారు. గంటన్నర వ్యవధిలో మరమ్మతులు పూర్తిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ‘వెల్‌డన్.. నెంటూర్ స్టాఫ్’ అంటూ అందరి ప్రశంసలు చూరగొన్నారు.
సిద్దిపేటకమాన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిని పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం న్యాయమూర్తి జయప్రసాద్‌ను కూడా కలిశారు. పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి చర్చించుకున్నారు.