ఇదేం బువ్వ! | - | Sakshi
Sakshi News home page

ఇదేం బువ్వ!

Oct 16 2025 8:14 AM | Updated on Oct 16 2025 8:14 AM

ఇదేం బువ్వ!

ఇదేం బువ్వ!

మాడిన అన్నం.. నీళ్ల చారు

అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. మధ్యాహ్న భోజనం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉడికీ ఉడకని అన్నం, అరకొర కూర, నీళ్లచారే అందిస్తుండటంతో విద్యార్థులు అర్ధాకలితోనే ఉండాల్సి వస్తోంది. కొన్ని చోట్ల పచ్చిపులుసుతో వడ్డిస్తుండటం చూసి సాక్షాత్తు కలెక్టర్‌ హెచ్చరించినా సంబంధిత అధికారుల తీరు మారకపోవడం గమనార్హం. బుధవారం సాక్షి పలు పాఠశాలలను సందర్శించగా విద్యార్థులకు మాడిన అన్నం, నీళ్ల చారుతోనే వడ్డిస్తుండటం కనిపించింది.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలో 980 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 80వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రోజూ 64వేల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రూ.6.78 కేటాయించగా, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.11.17 కేటాయించారు. దీనికి తోడు కోడి గుడ్డుకు రూ.6 అదనంగా అందిస్తున్నారు. బియ్యం ప్రభుత్వమే అందిస్తోంది. కూరగాయలు, ఇతర వంట సరుకులు మధ్యాహ్న భోజన నిర్వాహకులు తీసుకువచ్చి భోజనం తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. అయితే విద్యాశాఖ ఇచ్చిన మోనూ ప్రకారం కూరలు, వారంలో మూడు రోజులు కోడిగుడ్లు అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆహారం రుచిగా, శుచిగా ఉండటం లేదని, సగం కడుపే నిండుతోందని విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలో 1,933 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు

మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ అధికారులు రోజూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ.. సక్రమంగా అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంలేదని, ప్రధానోపాధ్యాయులు అసలే పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులు, ఎంఈఓలు, కాంప్లెక్స్‌, ప్రధానోపాధ్యాయులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తీరును కలెక్టర్‌ హైమావతి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించగా పచ్చి పులుసుతో వడ్డిస్తుండటం.. మోనూ పాటించకపోవడాన్ని గుర్తించారు. దీంతో నంగునూరు మండలం బద్దిపడగ ప్రధానోపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించారు. అలాగే తోర్నాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఆదేశించారు. గతంలో ఇర్కోడ్‌ పాఠశాలలో ఇదే దుస్థితి. సాక్షాత్తు కలెక్టర్‌ ఎదుటనే మధ్యాహ్న భోజనం అమలు ఈ విధంగా ఉంటే, మిగతా సమయాలలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు.

మధ్యాహ్న భోజనం నాసిరకం

కానరాని మెనూ.. అందని పౌష్టికాహారం

అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు

జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి

సాక్షాత్తు కలెక్టర్‌ హెచ్చరించినా మారని తీరు

సగం గంటెడే కూర

మధ్యాహ్న భోజనంలో సగం గంటెడే కూర వేస్తారు. మళ్లీ వేయరు, మిగతా అన్నం చారుతోనే సరిపెట్టుకోవాలి. మోనూ ప్రకారం పాటించడంలేదు. కలెక్టర్‌, అధికారులు వస్తున్నారని తెలిస్తేనే కూరలు అందిస్తారు. మిగతా రోజుల్లో సగం కడుపుకే తినాల్సి వస్తోంది.

–పేరు చెప్పడానికి ఇష్టపడని,

ఓ విద్యార్థి ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement