
బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి
సీపీ విజయ్‌కుమార్
సిద్దిపేటకమాన్: బాణా సంచా విక్రయాలకు అను మతులు తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని దీపావళిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలోని పట్టణాలు, మండల కేంద్రాలు, ఆయా గ్రామాల్లో తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకునే యజమానులు సంబంధిత ఏసీపీల అనుమతులు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాణాసంచా దుకాణాల వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంటే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 67100కు ఫోన్ చేయాలని తెలిపారు.
దుబ్బాక: పట్టణంలోని జెడ్పీజీహెచ్‌ఎస్ జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు బి.రజిత రాష్ట్ర ఉత్తమ మెంటర్ –2025 పురస్కారం అందుకున్నారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన మనక్ మహోత్సవంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నుంచి రజిత పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా రజితను పాఠశాల హెచ్‌ఎం భూపాల్, ఉపాధ్యాయులు అభినందించారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో రామవరంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న క్రమంలో రోడ్డు ఎత్తుగా.. ఇళ్లు దిగువకు ఉండటంతో వర్షపు నీరు చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. త్వరగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు.
సిద్దిపేటకమాన్: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21నుంచి 24వరకు పోలీస్‌స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్ నివారణలో పోలీసులు, విద్యార్థుల పాత్ర అనే అంశంపై వ్యాస రచన పోటీ ఉంటుందన్నారు. ప్రతిభ కనబర్చిన మొదటి ముగ్గురు అభ్యర్థులకు సీపీ కార్యాలయంలో బహుమతుల ప్రదానం చేసి, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారన్నారు.

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి