
హుస్నాబాద్‌లో ట్రామా!
● అన్నీ ఎమర్జెన్సీ కేసులు ఇక్కడే..
● సత్వర వైద్య సేవలు.. ప్రజల ప్రాణాలకు భరోసా
హుస్నాబాద్: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు తక్షణమే వైద్య సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక ట్రామా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే మొదటి విడతలో 30 ట్రామా కేర్ సెంటర్లు మంజూరు చేయగా, రెండో విడత లిస్టులో హుస్నాబాద్ పేరును చేర్చారు. హుస్నాబాద్ ప్రాంతంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అత్యవసర కేసులను ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేయకుండా ఎంత క్లిష్టమైన కేసులనైనా ఈ సెంటర్‌లోనే శస్త్ర చికిత్సలు అందిస్తారు. ఆర్ధోపెడిక్, అనస్తీషియా ఇతర వైద్య నిపుణులు, సిబ్బంది, అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతుంది.