
కౌలు.. కన్నీళ్లు..!
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఎలాంటి జీవనధారం లేని వారు వ్యవసాయంపై మక్కువతో కౌలు రైతులుగా మారుతున్నారు. గ్రామంలోనే వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కంటే ఈ సారి కౌలు రైతులకు కన్నీళ్లు, అప్పులు తప్ప ఏమి మిగిలే పరిస్థితి కనిపించడంలేదు. జిల్లాలో ఈ యేడు కౌలు రైతులకు కౌలు..కష్టం..పెట్టుబడి..కన్నీళ్లు మాత్రమే మిగిల్చింది. జిల్లాలో ఖరీఫ్‌లో ఈ సారి ఐదు లక్షల ఎకరాలకు పైగా వివిధ పంటలను సాగు చేశారు. వరి అత్యధికంగా 3.40 లక్షల ఎకరాలు, పత్తి 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాలు, కూరగాయలు 28 వేల ఎకరాలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలో సుమారు 50 వేలకు పైగా ఎకరాల్లో పంటలు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జిల్లాలోని ఎక్కువ శాతం గజ్వేల్ నియోజకవర్గంలోని నల్లరేగడి భూములు ఉండటం వల్ల ఇక్కడి రైతులు పత్తి పంటను సాగు చేశారు. గజ్వేల్, జగదేవ్‌పూర్‌లో మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు. జగదేవ్‌పూర్ మండలంలోని 14,200 ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో వరి, 220 ఎకరాల్లో మొక్కజొన్న, మూడు వందల ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేశారు.
కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం
జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం పంటలను చూస్తుంటే కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. జిల్లాలో 3 లక్షలకు పైగా రైతులు ఉంటే కౌలు రైతులు 50 వేల వరకు ఉన్నారు. భూముల రకాలను బట్టి ఎకరానికి కౌలు రూ.8 వేల నుంచి 15 వేలు చెల్లిస్తున్నారు. అకాల వర్షాలతో పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో ఎకరానికి కనీసం ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేటట్లు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్ర నెలలో కొంత భాగానే ఉన్నప్పటికి నల్లరేగడి భూముల్లో పంటలు పూర్తిగా నష్టం జరిగిందని కౌలు రైతులు చెబుతున్నారు. ఎకరం భూమిపై సుమారు 15 వేల నుంచి 30 వేల నష్టం జరుగుతుందని చెబుతున్నారు. పత్తి ఏరడానికి కూలీలకు రోజుకు రూ.350 నుంచి 400 వరకు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. అయినా కూలీల కొరత తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఆగం చేసిన అకాల వర్షాలు
అప్పులు తప్ప మిగిలిందేమీ లేదు
కౌలు రైతుల అష్టకష్టాలు
ఆదుకోవాలని సర్కార్‌కు వినతి
పెట్టుబడి వచ్చేటట్లు లేదు
సొంత భూమి ఏమి లేకపోవడంతో కౌలు రైతుగానే జీవనం సాగిస్తున్నా. గ్రామంలోని ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో పత్తి పంటను సాగు చేసిన. అకాల వర్షాలు కురవడం, సరైన సమయంలో యూరియా దొరక్కపోవడంతో పంట ఎదగలేదు. దీంతో పాటు పంట అంత ఎర్రబడి కాయ నల్లబడింది. మొత్తం పెట్టుబడి రెండు లక్షలకు పైగా అయింది. ప్రస్తుతం పంటలను చూస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
–అశోక్, రైతు, తిగుల్

కౌలు.. కన్నీళ్లు..!