
చేర్యాల ప్రజల ఆకాంక్ష నెరవేర్చండి
చేర్యాల(సిద్దిపేట): సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నాలుగు మండలాల అఖిల పక్ష నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నర్సయ్యపంతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. చేర్యాల ప్రాంతం విద్య, వైద్య, వ్యాపారరంగాల్లో వెనుకబడిందని, రెవెన్యూ డివిజన్ చేస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తూ ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిందే
జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం