
నేడు కోహెడకు గవర్నర్ రాక
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
● పర్యటనకు సర్వం సిద్ధం
● హాజరుకానున్న ఐదుగురు మంత్రులు
● సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
● శాఖల వారీగా బాధ్యతలు అప్పగింత
కోహెడ(హుస్నాబాద్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం మధ్యాహ్నం కోహెడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళా సంఘాలకు స్టీల్ (డైనింగ్) సామగ్రిని గవర్నర్ పంపిణీ చేయనున్నారు. బుధవారం కలెక్టర్ హైమావతి.. అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి సభాస్థలంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది హాజరుకానున్న దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.
ఐదుగురు మంత్రుల రాక..
ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా ‘పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు’ ఆధ్వర్యంలో నియోజక వర్గంలోని 276 మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ హాజరు కానున్నారు. తొలిసారిగా పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ కార్యక్రమం జయప్రదంపై అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు.
భారీ బందోబస్తు
గవర్నర్ పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. సభా స్థలాని సందర్శించి మాట్లాడుతూ.. 446 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ సదానందం, సీఐ శ్రీను, ఎస్‌ఐ అభిలాష్‌లతో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దుబ్బాక: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మున్సిపల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం వంటలతో పాటు విద్యార్థుల అభ్యసన ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు.