
గెలుపోటములు సహజమే
● క్రీడలతో మానసికోల్లాసం ● మాజీమంత్రి,ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఏడాది పాటు వందేళ్ల ఉత్సవాలు
● చట్ట సభల్లో సీపీఐ ఉంటేనే అర్థవంతమైన చర్చ ● ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
సిద్దిపేటజోన్: క్రీడాకారులు గెలుపు ఓటములను సహజమేనని వాటిని సమానంగా స్వీకరించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. స్థానిక సిటిజన్ క్లబ్‌లో రాష్ట్రస్థాయి మహిళా వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువులు, విదేశాల పయనంపైనే ఆలోచిస్తూ పిల్లల ఆరోగ్యం గురించి మర్చిపోతున్నారన్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని క్రీడామైదానాల వైపు పిల్లలను దృష్టి సారించేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాలీబాల్‌ను గ్రామీణ క్రీడగా అభివర్ణించారు. సిద్దిపేటలో జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో జాతీయ వాలీబాల్ అకాడమి వైస్‌ప్రెసిడెంట్ హన్మంతరెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిరాం, సిటిజన్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్‌చైర్మన్ కనకరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.
గురుపూజలో ఉన్న సంతృప్తి ఎక్కడా లభించదు
సిద్దిపేటఅర్బన్: పాఠాలు ఎవరైనా చెబుతారని, జీవిత పాఠాలు కొందరే చెబుతారని ఆ కొందరిలో దుర్గాప్రసాద్ స్వామీజీ ఒకరని, అలాంటి వ్యక్తిని గురువుగా భావించి సన్మానించుకోవడం తన అదృష్టంగా హరీశ్‌రావు పేర్కొన్నారు. గురుపూజోత్సవం పురస్కరించుకుని హనుమాన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీకి సిద్దిపేటలో గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. మనిషికి దైవ నామస్మరణ, గురుపూజలో ఉన్న సంతృప్తి, ఆనందం ఎందులోనూ ఉండదన్నారు. సిద్దిపేటలో ఏ కార్యక్రమం చేపట్టినా సిద్ధిస్తుందని, కోటి హనుమాన్ చాలీసా పారాయణం సంకల్పం సైతం సిద్ధించాలని కోరుకున్నారు.
హుస్నాబాద్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ భవన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపెడుతూ జిమ్మిక్కుల పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు సహజ వనరులను కొల్లగొడుతూ లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరస్తులైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత మోదీ వంటి దొంగలకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టులను చంపడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు కోసం ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు విషయంలో ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారన్నారు. దీనిపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత స్పష్టత వస్తుందని తెలిపారు. చట్టసభల్లో సీపీఐ ఉంటేనే అర్థవంతమైన చర్చ జరుగుతుందని చెప్పారు.
ఈ నెల 16న సీపీఐ జిల్లా మహాసభలు
హుస్నాబాద్‌లో ఈ నెల 16న సీపీఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆపార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ తెలిపారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జాగిరి సత్యనారాయణ, వనేష్, లక్ష్మణ్, నాయకులు కుమార్, జనార్ధన్, భాస్కర్, సుదర్శనచారి, రాజ్‌కుమార్ తదితరలున్నారు.

గెలుపోటములు సహజమే