
పైసలిస్తే పనులు ఖాయం!
తహసీల్దార్ కార్యాలయాల్లో దళారుల దందా
● నివాసం లేకున్నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ ● కొండపాక తహసీల్దార్ కార్యాలయం లీలలు
సాక్షి, సిద్దిపేట/కొండపాక(గజ్వేల్): కాసులకు ఆశపడి కొందరు రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో కొంతకాలంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వివిధ సర్టిఫికెట్ల జారీకి ఆన్‌లైన్ పద్ధతిలోకి వచ్చినా కొందరు రెవెన్యూ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భూముల మ్యుటేషన్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, రేషన్ కార్డుల మంజూరు వంటి వాటిని పొందేందుకు దళారులకు డబ్బులిచ్చి సులువుగా పని చేయించుకుంటున్నా రు. దళారులకు డబ్బులిచ్చి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి కొండపాక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓ మహిళ ఏకంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను పొందిన ఘటనే ఇందుకు నిదర్శనం.
దళారుల దందా...
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యథేచ్ఛగా దళారుల దందా కొనసాగుతోంది. సర్టిఫికెట్‌్‌కు ఒక రేటు ఫిక్స్ చేసి దళారులు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేస్తున్నారు. అన్ని తామే చూసుకుంటామని కొంత సమయం పెట్టి ఎలాంటి సర్టిఫికెట్ అయిన జారీ చేయిస్తున్నారు. దళారులు వసూలు చేసిన డబ్బుల నుంచి కొంత ఆయా అధికారులకు ముట్టచెప్పి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ సర్టిఫికెట్ల కోసం నేరుగా వెళ్లిన వారికి వివిధ సాకులు చెప్పి తిరిగిపంపించేస్తున్నారని వాపోతున్నారు. దీంతో దళారులను దరఖాస్తుదారులు ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టి దళారులు వసూళ్ల దందాను అరికట్టాలని, తప్పుడు పత్రాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ జరిగింది...
తొగుట మండలం గుడికందుల గ్రామంలో యాదయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 14ఏళ్ల క్రితం మృతిచెందింది. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలున్నారు. రెండవ భార్య సరిత హైదరాబాద్‌లో ఉంటుంది. గతేడాది భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. భర్త పేరు మీద గుడికందులలో ఒక ఎకరం 20 గుంటల భూమి ఉంది. ఆ భూమిని తన పేరు మీద రాయించుకునేందుకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను రెండవ భార్య సరిత కొండపాక తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందింది. ఈ సర్టిఫికెట్‌ను తీసుకుని తొగుట మండలంలో 878/అ/1లో ఉన్న 1.20ఎకరాల భూమిని మ్యుటేషన్ చేయాలని ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన మొద టి భార్య పిల్లలు తొగుట తహసీల్దార్‌ను కలిసి ఆ భూమి తమది అని చెప్పి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలని తహసీల్దార్‌కు సమాచారమిచ్చారు. దీంతో విచారణ చేపట్టిన తహసీల్దారు అధికారులను తప్పు దోవ పట్టించి ఎఫ్‌ఎంసీని పొందినట్లు గుర్తించారు. దీనిపై కొండపాక మండల తహసీల్దార్ శ్యాంను వివరణ అడగగా ఎఫ్‌ఎంసీని రద్దు చేశామన్నారు.