
ముమ్మరంగా వనమహోత్సవం
జిల్లాలో 22.47 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
● ఇప్పటివరకు 7లక్షలకు పైగా మొక్కలు నాటడం పూర్తి ● అన్ని శాఖల సమన్వయంతో ముందుకు
16 శాఖలు..
22 లక్షల మొక్కలు
జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం వివిధ శాఖల సమన్వయంతో కొనసాగుతుంది. అటవీ శాఖ 75,600, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖకు 13.2లక్షలు, మున్సిపాలిటీలకు 4.66లక్షలు, ఎడ్యుకేషన్ 2వేలు, మైన్స్ అండ్ జియాలజీ 2300, హార్టీకల్చర్, సెరీకల్చర్ 1,29,300, పశుసంవర్థక శాఖ 1వేయి, పౌరసరఫరాల విభాగం 2200, ఎకై ్సజ్ 67,700, వైద్యారోగ్యశాఖ 1400, బీసీ సంక్షేమశాఖ 500, నీటిపారుదల శాఖ 45,500, వ్యవసాయశాఖ 1,27,700, ఇండస్ట్రియల్ 20వేలు, పోలీసుశాఖ 4600 మొక్కలు నాటేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఇప్పటివరకు ఏడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు జిల్లా అటవీ అధికారులు చెబుతున్నారు.
సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 22.47లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించారు. ఇప్పటికే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అటవీశాఖ, పంచాయితీరాజ్ శాఖ అధికారులు ఏడు మున్సిపాలిటీలు, డీఆర్‌డీఓ పరిధిలో 489, ఫారెస్టు 3తోపాటు మొత్తం 499 నర్సరీల్లో 25.05లక్షల మొక్కలను సిద్ధం చేశారు. వనమహోత్సవం ద్వారా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని వర్గాలు, అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలను నాటేలా లక్ష్యం నిర్దేశించింది. ఆకుపచ్చ జిల్లాగా మార్చేందుకు అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటుతున్నారు.
25 లక్షల మొక్కలు సిద్ధం
జిల్లాలో 499 నర్సరీల్లో 25,05,348 మొక్కలను పంపిణీ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉంచారు. 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలో 22.47లక్షల (22,47,800) మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 7.17లక్షల (31.68%) మొక్కలు నాటారు. వనమహోత్సవ పట్టణాలు, గ్రామ పంచాయితీ పరిధిలో కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం అన్ని గ్రామ పంచాయితీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని అన్ని శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు పనులు కొనసాగిస్తున్నారు. గతేడాది (2024–25) జిల్లాలో 21.62లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకోగా 19.12లక్షల మొక్కలు నాటి 88.41% పూర్తి చేశారు.
వనమహోత్సవం కొనసాగుతుంది
జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ఏడాది అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో 22.47లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ధేశించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో ఇతర అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది.
– జోజి, జిల్లా ఇన్‌చార్జి అటవీ అధికారి సిద్దిపేట