
ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడే
ఏపీ పోలీసుల తీరు దారుణం
● సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు
● నల్ల బ్యాడ్జీలతో నిరసన
సిద్దిపేటకమాన్: ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను బాహ్య ప్రపంచానికి తెలుపుతున్న సాక్షి మీడియాపై కక్షతో తనిఖీల పేరిట ఏపీ పోలీసుల తీరు.. ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నామని జిల్లా జర్నలిస్టుల సంఘాల నాయకులు అన్నారు. విజయవాడలో సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డి ఇంటిపైన పోలీసుల దాడిని ఖండిస్తూ గురువారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (143) జిల్లా ఇన్‌చార్జి గందే నాగరాజు, టీయూడబ్ల్యూజే(ఐజేయూ)నాయకులు రమణరావు, అంబటి యాదగిరిగౌడ్ లు మాట్లాడుతూ.. ఎలాంటి సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం హేమమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టుల స్వేచ్ఛను కాలరాసే ప్రయత్నాలు ఏపీలో జరగడం బాధాకరంగా ఉందన్నారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా జర్నలిస్టుల గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా జర్నలిస్టులు పనిచేస్తుంటారని, దాన్ని రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. ఏపీ ప్రభుత్వం తమ తీరు మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాజు, బాల్ నర్సయ్య, చంద్రమౌళి, దయానంద్, ఇంద్రసేనారెడ్డి, మురళి చారి, నరేష్, సాయి, సంతోష్, చందు, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్, శ్రీకాంత్, గిరి, నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.