
సిద్దిపేటజోన్: మంత్రి తన్నీరు హరిశ్‌రావు గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:30 గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందచేయనున్నారు. ఇప్పటికే ఆరుసార్లు అద్భుతమైన విజయాలను సాధించి ఏడోసారి గెలుపు కోసం ప్రజా ఆశీర్వాదం కోరుతున్నారు. 2010 ఉప ఎన్నికలో 95,858 ఓట్ల భారీ మెజారిటీ, 2018 ఎన్నికల్లో 1,18,699 ఓట్ల రికార్డు మెజార్టీ సాధించారు. సీఎం కేసీఆర్ మంత్రి వర్గంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ, ప్రస్తుతం ఆర్థిక, వైద్యారోగ్య శాక మంత్రిగా కొనసాగుతున్నారు.
ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉన్నా
ఐదేళ్లు అభివృద్ధి అనే పరీక్ష రాశా.. నేను రాసిన పరీక్షకు మార్కులు వేసే నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఎన్నికలప్పుడు వచ్చేవాణ్ణి కాదు.. ఎన్నికలు ఉన్నా లేకున్నా మీ మధ్య ఉండి అభివృద్ధి చేస్తున్నానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం రాత్రి తన నివాసంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణరెడ్డి మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకున్న, నాకు మీరు ఓట్ల రూపంలో మార్కులు వేసి దీవించాలని కోరారు.
నామినేషన్ కోసం సాయం
హరీశ్‌రావు నామినేషన్ వేసే నేపథ్యంలో మంత్రి దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ వాసులు రూ.21 వేలు మంత్రికి అందించి గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సాయిరాం పాల్గొన్నారు.
మంత్రి సమక్షంలో చేరికలు
గజ్వేల్: మండల పరిధిలోని రిమ్మనగూడ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువకులు బుధవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గ్రామ బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.