పటాన్‌చెరు–సంగారెడ్డి–జోగిపేట్–బోధన్ లైను సర్వేకు రూ.7.92 కోట్లు
● రైల్వేబడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు
● స్టేషన్లలో మౌలిక సదుపాయాలఅభివృద్ధి పనుల ప్రస్తావన
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డికి రైలు సౌకర్యం కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. పటాన్‌చెరు–సంగారెడ్డి–బోధన్–ఆదిలాబాద్ రైల్వేలైను అధ్యయనం కోసం రూ.7.92 కోట్ల నిధులను రైల్వేశాఖ ప్రతిపాదించింది. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పటికే ఈ లైను నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిన సంగతి తెలిసిందే. 317 కిలో మీటర్ల పొడవైన ఈ కొత్త లైనులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రూట్‌కు సంబంధించిన భాగం డీపీఆర్ పూర్తయిందని రైల్వేశాఖ వర్గాలు చెబుతున్నాయి. పటాన్‌చెరు–బోధన్ వరకు 114 కి.మీ.ల లైను డీపీఆర్ స్టేజీలో ఉంది. పటాన్‌చెరు సమీపంలోని వట్టినాగులపల్లి స్టేషన్ నుంచి సంగారెడ్డి–జోగిపేట–ముస్లాపూర్–నిజాంపేట–మగ్దూంపూర్–బాన్సువాడ–రుద్రూరు–జానకంపేట క్యాబిన్ ద్వారా బోధన్ లైనుతో అనుసంధానించేలా ఈ లైనును ప్రతిపాదించారు. ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే నిర్వహించనున్నారు. ఈ లైను నిర్మాణం పూర్తయితే సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్ నియోజకవర్గాల వాసుల రైల్వే కల నెరవేరనుంది. రైల్వేలైను నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. రైల్వేలైను సాధన సమితి ఆధ్వర్యంలో ఈ లైను మంజూరు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సాధన సమితి కన్వీనర్ గంగా జోగినాథ్ ఇప్పటికే పలుమార్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోపాటు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జి.కిషన్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను కలిసి ఈ రైల్వే ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు.
రైల్వే స్టేషన్‌ల అభివృద్ది..
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతుల కల్పన పనులను కూడా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మరోవైపు మనోహరాబాద్–సిద్దిపేట సెక్షన్‌లో ట్రాక్ పనులకు సంబంధించిన అంశాలు కూడా ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు. మనోహరాబాద్‌తోపాటు పలు స్టేషన్లలో గూడ్స్ షెడ్లు ఉన్నాయి. ఈ షెడ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల్లో భాగంగా హైమాస్ట్ లైట్ల ఏర్పాటును కూడా ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాగా, జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటైన జహీరాబాద్ స్టేషన్‌లో అమృత్ పథకానికి ఎంపిక చేసిన విషయం విదితమే. ఈ స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా ర్యాంపులతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, టాయిలెట్‌బ్లాక్‌ల నిర్మాణం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం
వట్టినాగులపల్లి–సంగారెడ్డి–జోగిపేట–బోధన్ రైల్వేలైను కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. ఈ లైను నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరుతూ ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను కలిశాం. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోపాటు, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డిలకు పలుమార్లు వినతిపత్రం అందజేశాం. ఈ లైను నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం వాణిజ్య పరంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఈ లైను నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– గంగా జోగినాథ్, రైల్వేసాధన సమితి కన్వీనర్


